ఆర్జీ–2 ఏరియాలో ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నమస్తే ఇందూర్ రామగుండం
భారతదేశంలోని తొలి కార్మిక సంఘంగా 1920 అక్టోబర్ 31వ తేదీన ముంబైలో లాలా లజపతిరాయ్ గారి అధ్యక్షతన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఆవిర్భవించింది. ఈ చారిత్రక సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వివి గిరి, సరోజినీ నాయుడు, చిత్తరంజన్ దాస్ వంటి మహానేతలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 64 సంఘాలకు చెందిన 101 మంది ప్రతినిధులు హాజరై 1,40,854 మంది సభ్యుల ప్రాతినిధ్యం వహించారు.రెండవ మహాసభలో ఏఐటీయూసీ బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని సాధించాలని తీర్మానం చేసింది. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీగా నిలిచింది. కార్మికులు, రైతుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి, ప్రభుత్వ రంగ పరిశ్రమల స్థాపనలో కీలక పాత్ర పోషించింది.ఏఐటీయూసీ అనుబంధంగా కామ్రేడ్ దేవురి శేషగిరిరావు గారి అధ్యక్షతన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏర్పడింది. అనేకమంది అమరుల త్యాగాలతో కార్మికుల కోసం పలు హక్కులను సాధించింది.ప్రైవేట్ కాంట్రాక్టర్ల ఆధీనంలో నడిచిన సింగరేణిని ప్రభుత్వ రంగ సంస్థగా మార్చడంలో ఈ యూనియన్ కీలకపాత్ర పోషించింది. వేతన సవరణలు, వేజ్ బోర్డు, 44 కార్మిక చట్టాలు, 8 గంటల పని విధానం, దీపావళి బోనస్, లాభాల వాటా, పెన్షన్ వంటి హక్కులు సాధించడం ఏఐటీయూసీ సాధించిన విశిష్ట విజయాలు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి, స్వాతంత్ర్యానికి ముందు ఉన్న వెట్టి చాకిరి విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆర్జీ–2 బ్రాంచ్ కార్యదర్శి జిగురు రవీందర్ గారు విమర్శించారు. కార్మిక వర్గం ఏకతా సాధించి ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆర్జీ–2 ఏరియాలోని అన్ని గనులు, ఓసీలు, విభాగాలలో ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాశ్, సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కందుకూరి రాజరత్నం, బ్రాంచ్ సహాయ కార్యదర్శులు శ్యాంసన్, గంధం సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ అన్నారావు, బ్రాంచ్ నాయకులు రవికుమార్, మహేందర్, సంపత్, పిట్ కార్యదర్శులు శంకర్, మహేందర్, రాజు, రాజిరెడ్డి, తాళ్లపల్లి నారాయణ, చిట్టంపల్లి మహేందర్, కుమారస్వామి, రాజసాగర్, లచ్చన్న, నాగుల శ్రీనివాస్ తదితర నాయకులు, యూనియన్ డెలిగేట్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఎర్రజెండా ఎగురుతోందంతవరకు — కార్మిక హక్కులు బతికే ఉంటాయి

