విద్య దీప శిఖ, సావిత్రిబాయి పూలే
* సావిత్రిబాయి జ్యోతిబాపూలే జయంతోత్సవ శుభాకాంక్షలు
* రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
* ఉమనగారి కృష్ణ గౌడ్ కవి గేయ రచయిత
సావిత్రీబాయి ఫూలే విద్యా విప్లవ శంఖారావం..
అక్షరాల అంధకారంలో
ఆడబిడ్డల అడుగులు బంధించబడిన రోజుల్లో
ఒక దీపశిఖలా వెలిగిన పేరు
సావిత్రీబాయి ఫూలే!
కులం గోడల్ని కూల్చిన కలం ఆమెది,
లింగ వివక్షను లెక్కచేయని అడుగు ఆమెది,
పుస్తకాన్ని ఆయుధంగా మార్చిన తొలి పోరాట శక్తి
ఈ దేశానికి ఆమె అందించిన వరం!
1848 జనవరి ఒకటి…
పూణే గడ్డపై
మొదటి మహిళా పాఠశాల తలుపులు తెరిచిన వేళ
విద్యకు కొత్త ఉదయం మొదలైంది!
బ్రాహ్మణ కట్టుబాట్లకు ప్రశ్నగా,
మూఢనమ్మకాలకు మంటగా,
ఆడపిల్లల చేతిలో
చాక్ ముక్క పెట్టిన విప్లవం ఆమెది!
వితంతువుల కన్నీళ్లకు కవచమై,
అనాధ శిశువులకు అమ్మ ఒడిగా మారి,
“మహిళా సేవా మండలి” ద్వారా
మానవత్వాన్ని ఉద్యమంగా మార్చింది!
దళితుల కోసం తెరిచిన పాఠశాల
కేవలం భవనం కాదు,
అది సమానత్వానికి పునాది!
ఉచిత విద్య… మధ్యాహ్న భోజనం…
ఆకలితో కాదు, ఆశతో చదవమన్న సందేశం!
కరువు కాలంలో
రెండువేల అనాథలకు
ఆమె గుండెనే ఆశ్రమం…
ఆమె ప్రేమే పాఠ్యపుస్తకం!
జ్యోతిరావు పూలే అంత్యక్రియలు నిర్వహించి
సమాజపు సంకెళ్లను విరిచిన సాహసం
ఆడవాళ్లకూ ఆచరణలో హక్కులున్నాయన్న
గట్టి ప్రకటన!
కవిత్వంలోనూ ఆమె విప్లవమే!
‘కావ్య ఫూలే’లో అక్షరాలు కాదు
అణచివేతకు ఎదురుదెబ్బలు!
‘పావన కాశీ సుబోధ్ రత్నాకర్’లో
భర్త కాదు ఉద్యమ సహచరుడికి అర్పణ!
ప్లేగు బాధిత బాలుడిని రక్షించేందుకు
తన ప్రాణాన్నే త్యాగం చేసిన
ఆ మానవత్వమే
ఆమె నిజమైన జీవచరిత్ర!
సావిత్రీబాయి
ఒక పేరు కాదు,
ఒక యుగం!
ఒక ఉపాధ్యాయురాలు కాదు,
ఒక విద్యా విప్లవం!
ఈ నాటికీ
పాఠశాల గడియ మోగిన ప్రతిసారి
ఆమె అడుగుల ప్రతిధ్వనే వినిపిస్తుంది!
విద్యే విముక్తి!
సమానత్వమే సాధన!
సావిత్రీబాయి ఫూలే
భారత స్త్రీ చైతన్యానికి చిరునామా!


